ఇంఫాల్: మణిపూర్ ప్రజలు ఆయుధాలను అప్పగించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ (Manipur Governor) అజయ్ కుమార్ భల్లా చివరి అవకాశం ఇచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆయుధాలు అప్పగిస్తుండటంతో గడువును పొడిగించారు. ఫిబ్రవరి 20 నుంచి అమలులోకి వచ్చిన వారం రోజుల గడువు గురువారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ గడువును మార్చి 6 సాయంత్రం 4 గంటల వరకు గవర్నర్ పొడిగించారు. కొండ, లోయ ప్రాంతాల ప్రజలు అదనపు సమయం కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ‘స్వచ్ఛందంగా ఆయుధాలను అప్పగించడానికి ఏడు రోజుల గడువు ముగిసింది. ఈ వ్యవధిని పొడిగించాలని లోయ, కొండ ప్రాంతాల ప్రజల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. ఈ అభ్యర్థనలను నేను పరిగణనలోకి తీసుకున్నా. మార్చి 6 సాయంత్రం 4 గంటల వరకు గడువును పొడిగించాలని నిర్ణయించుకున్నా’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, పొడిగించిన గడువులోగా భద్రతా దళాల నుంచి దోచుకున్న, చట్టవ్యతిరేకంగా కలిగి ఉన్న ఆయుధాలను అప్పగించే వారిపై ఎలాంటి శిక్షార్హమైన చర్యలు తీసుకోబోమని గవర్నర్ అజయ్ కుమార్ భల్లా మరోసారి భోరోసా ఇచ్చారు. ‘శాంతి, మత సామరస్యం, మన యువత భవిష్యత్తు, మన సమాజ భద్రతకు దోహదపడటానికి సంబంధిత ప్రతి ఒక్కరికీ ఇదే చివరి అవకాశం’ అని తాజా ప్రకటనలో స్పష్టం చేశారు.
మరోవైపు 2023 మే నుంచి మణిపూర్‌లోని మైతీ, కుకీ జాతుల మధ్య ఏడాదిన్నర కాలం పైగా ఘర్షణలు కొనసాగాయి. హింసాత్మక సంఘటనల్లో 250 మందికి పైగా మరణించగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఫిబ్రవరి తొలి వారంలో సీఎం ఎన్ బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 13న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను కేంద్రం విధించింది.