న్యూఢిల్లీ, జనవరి 13: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ62 ప్రయోగంలో ఊహించని ట్విస్ట్ ఇది. ప్రయోగం విఫలమైనా.. అది మోసుకెళ్లిన ఉపగ్రహాల్లో ఒకటి నిర్దిష్ట కక్ష్యలోకి చేరింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం ఉదయం నింగికెగసిన రాకెట్ కీలకమైన మూడో దశలో సాంకేతిక లోపంతో గతి తప్పిన సంగతి తెలిసిందే. దీంతో అది మోసుకెళ్లిన 16 ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలోకి చేరలేకపోయాయి. అయితే తమ శాటిలైట్ అంతరిక్షం నుంచి డాటా పంపుతున్నదని స్పెయిన్కు చెందిన స్టార్టప్ సంస్థ ఆర్బిటల్ పారాడిజిమ్ తెలిపింది. పీఎస్ఎల్వీ విఫలమైనా అది మోసుకెళ్లిన తమ ‘కెస్ట్రెల్ ఇనీషియల్ డెమాన్స్ట్రేటర్ (కిడ్) బతికిపోయిందని పేర్కొంది. ఫుట్బాల్ సైజులో 25 కేజీల బరువున్న తమ శాటిలైట్ అన్ని అవాంతరాలను తట్టుకొని రాకెట్ నుంచి విడిపోయి కక్ష్యలోకి చేరిందని మంగళవారం వెల్లడించింది. అది వెంటనే తన పనిని ప్రారంభించి మూడు నిమిషాలపాటు డాటా పంపిందని తెలిపింది. తాము దాని గమనాన్ని పునర్నిర్మిస్తున్నామని పేర్కొంది.