Delhi CM : బీజేపీ (BJP) పై ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అతిషి (Atishi) తీవ్ర విమర్శలు చెప్పారు. బీజేపీ ఎప్పుడూ ప్రత్యర్థి పార్టీలను దూషిస్తూ ఉంటుందని, ఆ కూతల పార్టీకి ఒక ఎజెండా అంటూ లేనేలేదని ఆమె మండిపడ్డారు. ఆప్ చీఫ్ (AAP Chief) అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను దూషించడమే వారికున్న ఏకైక ఎజెండా అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తమ చీఫ్ మినిస్టర్ అభ్యర్థి ఎవరో కూడా ప్రకటించే స్థితిలో లేదని విమర్శించారు.
ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో ఢిల్లీ ప్రజలే నిర్ణయించుకోవాలని, బీజేపీ వైఖరిని చూస్తుంటే ప్రజలకు నిర్ణయం తీసుకోవడం చాలా సులువే అనిపిస్తోందని అతిషి వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలోని గోవింద్పురిలో ఆప్ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం అతిషి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుండటంతో అక్కడ త్రిముఖ పోరు నెలకొంది.
ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల కోసం జనవరి 10 నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 17 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. 18న నామినేషన్ల స్క్రూటినీ నిర్వహిస్తారు. జనవరి 20 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.