న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : క్యాన్సర్‌పై పోరులో సంచలన విజయం సాధించినట్టు పరిశోధకులు పేర్కొంటున్నారు. తాము ఒక సూపర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని, అది క్యాన్సర్ గడ్డగా మారకముందే.. కణాల దశలోనే దానిని ధ్వంసం చేస్తుందని పేర్కొన్నారు. తమ వ్యాక్సిన్.. క్యాన్సర్ కణాలను ముందుగానే గుర్తించి ప్రారంభ దశలోనే వాటిపై దాడి చేసేలా శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణనిస్తుందని అంటున్నారు. ఈ పరిశోధన ఫలితం క్యాన్సర్ నివారణలో విప్లవాత్మకమైనదిగా పరిణమించవచ్చునని భావిస్తున్నారు. అయితే ఈ పరిశోధన ఇంకా ప్రారంభదశలోనే ఉన్నదని, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ను నిరోధించేందుకు సంపూర్ణంగా దోహదపడవచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మసాచుసెట్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ‘సూపర్ వ్యాక్సిన్’ను అభివృద్ధి చేసినట్టు ప్రకటించారు. పరిశోధనశాలలోని ఎలుకలపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించినప్పుడు ప్రాణాంతకమైన క్యాన్సర్‌ను నిరోధించినట్టు తెలిపారు. ఈ వ్యాక్సిన్ జంతువులలో క్యాన్సర్ కణాలు కణతిగా మారకముందే గుర్తించి, ధ్వంసం చేసేలా రోగ నిరోధక వ్యవస్థను సిద్ధం చేసిందని వివరించారు. అనేక ఎలుకలపై జరిపిన ఈ పరిశోధనలో వ్యాక్సిన్ ఇచ్చినవి ఆరోగ్యంగా ఉండగా, ఇవ్వనివి క్యాన్సర్ బారిన పడినట్టు తెలిపారు.