జబల్పూర్: సరిగా పనిచేయకపోతే పై అధికారులు జీతం ఆపిన సందర్భాలు చూశాం. కానీ తన జీతం తానే ఆపించుకొన్న ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకొన్నది. జబల్పూర్ జిల్లా కలెక్టర్ కరంవీర్ శర్మ ఈ నిర్ణయం తీసుకొన్నారు. సీఎం హెల్ప్లైన్కు వచ్చిన ఫిర్యాదులను 100 రోజులు దాటినా పరిష్కరించటంలో విఫలమైనందుకు తనతో పాటు మరికొంతమంది ఉన్నతాధికారుల జీతాలు ఆపాలని జిల్లా ట్రెజరీ అధికారికి ఆదేశాలు జారీచేశారు. సోమవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని అధికారులకు స్పష్టం చేశారు. నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన కొందరు తాసిల్దార్ల జీతాల పెంపు కూడా కలెక్టర్ ఆపించారు.