న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచి శివను ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపికే చేసే అవకాశం ఉంది. అధికార ఎన్డీఏ తన అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రాంతీయ రాజకీయాల వల్ల ఎదురయ్యే అవరోధాన్ని అధిగమించేందుకు అదే రాష్ర్టానికి చెందిన మరో నాయకుడిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నది. అభ్యర్థిని నిర్ణయించేందుకు సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు సమావేశం కానున్నారు. ఈ సమావేశం తర్వాతే ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థి పేరు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. తమిళనాడులో బీజేపీ అగ్రనాయకుడైన మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ని ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది.