ముంబై: జమ్ముకశ్మీర్‌కు తిరిగి రావడంపై కశ్మీరీ పండిట్లకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కలలు చూపించిందని, అయితే భద్రత లేక ఉగ్రవాదులు చంపుతుండటంతో వారు భయంతో తిరిగి పారిపోతున్నారని శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. కశ్మీర్ లోయలో పరిస్థితిపై శనివారం ఆయన మాట్లాడారు. గత కొన్ని రోజులుగా కశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని చంపుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల్లో 9 మంది కశ్మీరీ పండిట్లు హతమయ్యారని తెలిపారు. ఈ భయానక వాతావరణంపై భయాందోళన చెందుతున్న వందలాది కశ్మీరీ పండిట్లు ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని తిరిగి అక్కడి నుంచి పారిపోతున్నారని చెప్పారు. దిగ్భ్రాంతి కలిగించే ఈ పరిణామంపై యావత్ దేశం ఆగ్రహంతో ఉందన్నారు.
కాగా, ఈ కష్ట కాలంలో కశ్మీరీ పండిట్లకు మహారాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుదని, వారికి అవసరమైన సహాయం చేస్తామని సీఎం ఉద్ధవ్ ఠాక్రే భరోసా ఇచ్చారు. వారి కోసం మహారాష్ట్ర తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. 1995లో రాష్ట్రంలో శివసేన ప్రభుత్వం ఉన్నప్పుడు నాటి పార్టీ చీఫ్ బాలాసాహెబ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. కశ్మీరీ పండిట్ల సమస్యను ప్రత్యేకంగా పరిగణించిన ఆయన వారి పిల్లల విద్య కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించారని చెప్పారు.