Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండనని స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఆప్ కార్యాలయం (APP office) లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే తమతో ఉండి ముందుకు నడిపించాడని అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడతానని తెలిపారు. ఆప్ నాయకులు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారని, త్వరలోనే వారు కూడా బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇటీవల కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. దాంతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.