న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఇవాళ సీజేఐ బీఆర్ గవాయ్‌పై ఓ లాయర్ తన షూ విసిరేందుకు ప్రయత్నించారు. సీజేఐ కూర్చున్న డయాస్ వద్దకు ఓ లాయర్ వెళ్లి.. తన కాలుకున్న షూను తీసి, జడ్జీ మీదకు విసిరే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఓ కేసు వాదనల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే అక్కడే ఉన్న సెక్యూర్టీ సిబ్బంది వెంటనే కలగజేసుకుని ఆ లాయర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని బయటకు తీసుకెళ్లారు. ఆ లాయర్‌ను కిషోర్ రాకేశ్‌గా గుర్తించారు. కోర్టు రూమ్ నుంచి బయటకు తీసుకెళ్తున్న సమయంలో.. ఆ లాయర్ సనాతన ధర్మంపై నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. సనాతన్ కా అప్మాన్ నహీ సహింగే.. సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదని ఆ లాయర్ అన్నారు.
సీజేఐ గవాయ్ మాత్రం ఆ ఘటన పట్ల ఎటువంటి అధైర్యానికి లోనుకాలేదు. కోర్టులో ఉన్న లాయర్లను తమ వాదనలు కొనసాగించమని కోరారు. ఇలాంటి వాటి వల్ల ఎవరూ విచలితులు కావొద్దు అని, తామేమీ చలించడం లేదని, ఇలాంటి ఘటనలు తనను ప్రభావితం చేయలేవని సీజేఐ గవాయ్ పేర్కొన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం సీజేఐ గవాయ్.. ఓ కేసులో చేసిన వ్యాఖ్యల వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఖజురహోలోని ఏడు అడుగల విష్ణు విగ్రహాన్ని పునర్ ప్రతిష్టించాలని దాఖలు చేసిన కేసులో సీజేఐ గవాయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ కేసును ఆయన డిస్మిస్ చేస్తూ వెళ్లి ఆ దేవుడినే అడుక్కోవాలన్న కామెంట్ చేశారు. విష్ణువుకు వీరభక్తుడిని అని చెప్పుకుంటున్నావు కాదా, వెళ్లి ఆ దేవుడినే ప్రార్థించుకో, అదో ఆర్కియాలజీ సైట్ అని, దానికి ఏఎస్ఐ పర్మిషన్ అవసరం ఉంటుందని ఆ కేసులో సీజేఐ వ్యాఖ్యానించారు.
ఖజురహో కేసులో సీజేఐ గవాయ్ చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. మతపరమైన భావాలను కించపరిచినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ వివాదానికి ఆయన తనదైన స్టయిల్లో తెరించారు. రెండు రోజుల తర్వాత ఓ కేసులో స్పందిస్తూ తానేమీ ఏ మతాన్ని అమర్యాదపరచలేదన్నారు. అన్ని మతాలను గౌరవిస్తానని, కేవలం సోషల్ మీడియాలోనే తన వ్యాఖ్యలు ప్రచారం అయినట్లు ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీజేఐకి అండగా నిలిచారు. సోషల్ మీడియాల్లో కొన్ని సందర్భాల్లో ప్రతిచర్యలు భిన్నంగా ఉంటాయన్నారు.