MUDA Scam : మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (MUDA) కుంభకోణంపై సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలుపడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. గతంలో సీఎంలపై విచారణకు గవర్నర్ అనుమతిచ్చిన చాలా సందర్భాల్లో సీఎంలు అరెస్టయ్యారు. దాంతో ఇప్పుడు సిద్ధరామయ్య కూడా అరెస్ట్ అవుతారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ విచారణకు అనుమతించడంతో గతంలో అరెస్టయిన సీఎంల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1997లో దాణా కుంభకోణానికి పాల్పడినట్లు అప్పటి బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఆరోపణలు వచ్చాయి. దాంతో విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేశాయి. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో సీబీఐ విచారణ చేయాలనే డిమాండ్ వినిపించింది. తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అప్పటి బీహార్ గవర్నర్ ఏఆర్ కిద్వాయ్.. లాలూ యాదవ్‌పై కేసు నమోదు చేయడానికి అనుమతి ఇచ్చారు. అనంతరం సీబీఐ ఈ కేసు దర్యాప్తును ప్రారంభించింది. విచారణ తర్వాత సీబీఐ నాటి సీఎం లాలూను అరెస్టు చేసింది. దాంతో లాలూ తన భార్య రబ్రీదేవిని సీఎం కుర్చీపై కూర్చోబెట్టారు.
2011లో బీఎస్ యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే సమయంలో సంతోష్ హెగ్డే నేతృత్వంలోని లోకాయుక్త యడ్యూరప్పపై అవినీతి ఆరోపణలు చేసింది. యడ్యూరప్ప అక్రమంగా భూములు కేటాయించారని ఆరోపించింది. దాంతో అప్పటి కర్ణాటక గవర్నర్ హన్సరాజ్ భరద్వాజ్.. యడ్యూరప్పపై విచారణకు అనుమతి ఇచ్చారు. హన్స్‌రాజ్ తీసుకున్న ఈ నిర్ణయంపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. లోకాయుక్త కోర్టు యడ్యూరప్పకు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. 2011 అక్టోబర్‌లో యడ్యూరప్ప అరెస్టయ్యారు. దాంతో ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారు. ఈ కేసులో యడ్యూరప్ప 23 రోజుల పాటు జైలులో ఉన్నారు. అనంతరం ఈ కేసును సీబీఐ టేకోవర్ చేసింది.
2022లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కేజ్రీవాల్ ప్రభుత్వ మద్యం పాలసీపై దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో తొలుత అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ విచారించింది. 2022 అక్టోబర్‌లో ఈడీతోపాటు సీబీఐ.. సిసోడియాను అరెస్టు చేశాయి. సిసోడియాపై కేసు విచారణ జరుగుతుండగానే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ నిందితుడిగా చేర్చింది. సుదీర్ఘ విచారణ తర్వాత 2024 మార్చిలో ED కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. అనంతరం సీబీఐ కూడా తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్‌ను కస్టడీలోకి తీసుకుంది. అయితే కేజ్రీవాల్ మాత్రం సీఎం పదవికి రాజీనామా చేయడంలేదు.
2006లో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీల మద్దతుతో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మధు కోడా జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. కోడా ప్రభుత్వం 2 సంవత్సరాలు సజావుగా కొనసాగింది. ఆ తర్వాత సీఎం మధుకోడాపై మైనింగ్ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. బొగ్గు గనుల కేటాయింపులో దాదాపు రూ.400 కోట్ల అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో అప్పటి గవర్నర్ సిబ్తే రిజ్వీ.. మధుకోడాపై దర్యాప్తు కోసం సీబీఐకి లేఖ రాశారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించినప్పుడు మనీలాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలు దొరికాయి. 2009లో కోడా కేసులో సీబీఐ, ఈడీ సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. విచారణలో కోడాను సీబీఐ అరెస్ట్ చేసింది. 2012 వరకు ఆయన జైలులోనే ఉన్నారు. ఈ కేసులో అతనికి 2017లో శిక్ష పడింది. ప్రస్తుతం మధు కోడా భార్య రాజకీయాల్లో ఉన్నారు.
ముడా కుంభకోణంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. దాంతో ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా సిద్ధరామయ్యపై కుట్ర జరుగుతోందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్యను జైలుకు పంపడం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య న్యాయ సలహా తీసుకుంటున్నారు. మరోవైపు గవర్నర్ నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.