లక్నో: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్.. ప్రచారంలో భాగంగా దాదాపు అన్ని రాష్ట్రాలను చుట్టి వచ్చారు. ఆఖరిరోజు ఉత్తరప్రదేశ్‌లో థరూర్ ప్రచారం కోసం వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ పార్టీ సిద్ధాంతంతో తమకు ఎలాంటి సమస్య లేదని, అయితే మా పనితీరులోనే మార్పు తీసుకురావాలని తాను భావిస్తున్నానని చెప్పారు.
పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా ఉన్న మల్లిఖార్జున్ ఖర్గే గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక అనుభవజ్ఞుడైన నాయకుడని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆయన నాపై గెలిస్తే సహజంగానే ఒకరికొకరం పరస్పర సహకారంతో పనిచేస్తామని థరూర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నది.
పోలింగ్ నేపథ్యంలో ఆ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అన్ని రాష్ట్రాల్లో పార్టీ ప్రతినిధుల కోసం పోలింగ్ బూత్‌లను, సిబ్బందిని సిద్ధపర్చింది. సోమవారం పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను స్థానికంగానే భద్రపర్చి.. మంగళవారం ఢిల్లీకి తరలించనున్నారు. బుధవారం ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం శశిథరూర్ మరో సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేపై తలపడుతున్నారు.