కోచ్చి, అక్టోబర్ 17: కేరళలో ‘గవర్నర్ వర్సెస్ సర్కారు’ వివాదం మరింత ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తనను విమర్శించే మంత్రులను బర్తరఫ్ చేస్తానని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌ఖాన్ తాజాగా హెచ్చరించడంపై దుమారం రేగింది. గవర్నర్ తన అనుజ్ఞ మేరకు మంత్రులను నియమిస్తారన్న నిబంధన ఉపయోగించుకొంటానని ఖాన్ మంత్రులను బెదిరిస్తున్నారు. రాజ్యాంగ సంక్షోభానికి ఇది తెరతీస్తుందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. బీజేపీ సర్కారు నియమించిన ఈ గవర్నర్ ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటుండటం పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో పలువురు మంత్రులు గవర్నర్ వైఖరిని తీవ్రంగా విమర్శించారు.
తాజాగా ఉన్నత విద్యాశాఖమంత్రి ఆర్ బిందు చేసిన విమర్శలు ఆయన ఆగ్రహానికి తక్షణ కారణమని తెలుస్తున్నది. ‘గవర్నర్ పదవి గౌరవాన్ని దిగజార్చే వ్యాఖ్యలు చేసే మంత్రులకు అనుజ్ఞ ఉపసంహరణతో సహా వారిపై అన్నిరకాల చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంటుందని’ ఖాన్ సోమవారం ట్విట్టర్లో హెచ్చరించారు. మంత్రి లేదా సీఎంకు అనుజ్ఞ ఉపసంహరించుకోవడం అంటే బర్తరఫ్ చేయడమేనని రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచారి వివరించారు. విశ్వవిద్యాలయాల సవరణ బిల్లుకు ఆమోదం తెలుపకుండా తొక్కిపెట్టడంపై మంత్రి బిందు విమర్శలు చేశారు. ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం నిర్దేశించిన విధులు, బాధ్యతలు ఉంటాయని ఆమె అన్నారు. గవర్నర్ హెచ్చరికలు జారీచేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మంత్రులెవరూ పరిధి మీరి విమర్శలు చేయలేదని, అంతా సంయమనంతోనే వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
కేరళ సీపీఎం విభాగం కూడా గవర్నర్ హెచ్చరికను దుయ్యబట్టింది. సీఎం సలహా మేరకే గవర్నర్ మంత్రులను నియమించడం, తొలగించడం చేస్తారని తెలిపింది. గవర్నర్‌కు తనంతట తానుగా చర్యలు తీసుకునే వీలు లేదని స్పష్టం చేసింది. రాజ్యాంగ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా ఆయనను నిరోధించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేసింది. గవర్నర్ ప్రకటన కేరళ ఎల్డీఎఫ్ సర్కారు పట్ల ఆయనకున్న రాజకీయ వివక్ష, శత్రుభావనను వెల్లడిస్తున్నదని విమర్శించింది. ఇష్టారాజ్యంగా మంత్రులను తొలగించే నిరంకుశాధికారాలేవీ గవర్నర్‌కు లేవని సీపీఎం స్పష్టం చేసింది. బీజేపీ, ఆరెస్సెస్ విధానాలను రుద్దాలని గవర్నర్ చూస్తున్నారని మంత్రులు కొంతకాలంగా విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రికి, మంత్రిమండలికి తనకు సలహాలు ఇచ్చే అధికారం ఉంటుందని, అయితే గవర్నర్ పదవి గౌరవాన్ని దిగజార్చే విమర్శలు చేస్తే ఊరుకోనని, బర్తరఫ్ వంటి చర్యలు తీసుకుంటానని ఖాన్ అంటున్నారు. గతకొద్దిరోజులుగా ఖాన్ తీసుకొంటున్న చర్యలు వివాదాస్పదం అవుతున్నాయి. కేరళ వర్సిటీ సెనేట్ సభ్యులు 15 మందిని తొలగిస్తూ ఆయన జారీచేసిన ఉత్తర్వులపై దుమారం రేగింది.