న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: సాధారణంగా దేశాధినేతల విదేశీ పర్యటనలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత, విస్తృతమైన ప్రొటోకాల్ ఏర్పాట్ల మధ్య జరుగుతుంటాయి. కానీ, ఇటీవల భూటాన్ పర్యటనకు వెళ్లిన థాయ్‌లాండ్ రాజ దంపతులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ అధికారిక పర్యటనలో రాజు మహా వజ్రలాంగ్‌కోర్న్, రాణి సుతీద థాయ్‌లాండ్ రాజకుటుంబానికి చెందిన బోయింగ్ 737-800 విమానాన్ని స్వయంగా నడుపుతూ ఈ నెల 25న భూటాన్‌లో అడుగుపెట్టారు. అది కూడా ప్రపంచంలోనే అత్యంత సవాళ్లతో కూడిన పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యంత చాకచక్యంగా, సురక్షితంగా ఆ విమానాన్ని దింపి అందరినీ ఔరా అనిపించారు. అక్కడ వారికి భూటాన్ రాజ కుటుంబం ఘన స్వాగతం పలికింది.
అనంతరం భూటాన్‌లో నాలుగు రోజులపాటు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న థాయ్ రాజ దంపతులు సోమవారం తమ స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. అప్పుడు సైతం వజ్రలాంగ్‌కోర్న్ పైలట్‌గా, సుతీద కో-పైలట్‌గా ఆ విమానాన్ని స్వయంగా నడుపుకుంటూ వెళ్లిపోయారు. 2019లో థాయ్‌లాండ్ రాజుగా బాధ్యతలు చేపట్టిన వజ్రలాంగ్‌కోర్న్ ఆ హోదాలో విదేశీ పర్యటన జరపడం ఇదే తొలిసారి. గతంలో రాయల్ థాయ్ ఆర్మీలో కెరీర్ ఆఫీసర్‌గా పనిచేసిన వజ్రలాంగ్‌కోర్న్.. అప్పట్లోనే ఎఫ్-5, ఎఫ్-16, బోయింగ్ 737-400 విమానాలను నడిపే అర్హత పొందారు. అదే ఇప్పుడు ఆయన స్వయంగా విమానాన్ని నడిపేందుకు దోహదపడింది.