న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో తీవ్ర నీటి సంక్షోభం నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు బుధవారం మండిపడింది. ట్యాంకర్ మాఫియా, నీటి వృథాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. నీటి వృథా నివారణకు చేపట్టిన చర్యలను వివరించాలని ఆదేశించింది.
ట్యాంకర్ మాఫియాను రాష్ట్ర ప్రభుత్వం అరికట్టలేకపోతే, తాము స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కోరుతామని న్యాయమూర్తులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి నీరు వస్తున్నప్పటికీ, కోర్టు సమక్షంలో తప్పుడు ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. నీటి సంక్షోభం గురించి మీడియా చానళ్ల కవరేజ్‌ని తాము చూస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.