న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: కోర్టులపై నిందారోపణలు చేసినందుకు సీబీఐకి శుక్రవారం సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. బెంగాల్లో 2021 ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్ల కేసులను రాష్ట్రం వెలుపల విచారణ జరిపించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌లు ఎస్ ఓకా, పంకజ్ మితల్తో కూడిన ధర్మాసనం విచారించింది. ‘మీరు ఏ ఉద్దేశంతో కేసును దాఖలు చేశారు.
యావత్ న్యాయ వ్యవస్థపై ఎందుకు నిందలు వేస్తున్నారు? మీ అధికారులకు అక్కడ ఉన్న న్యాయాధికారో, లేదా ఆ రాష్ట్రమో నచ్చకపోవచ్చు. అంతేకానీ యావత్ న్యాయవ్యవస్థ పనిచేయడం లేదని అనవద్దు. దీనిపై జడ్జీలు, జిల్లా జడ్జీలు, సివిల్ జడ్జీలు ఇక్కడకు వచ్చి తమను సమర్థించుకోలేరు’ అంటూ సీబీఐ తరపున హాజరైన అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో కేసు బదిలీ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ఆయన ధర్మాసనానికి తెలిపారు.