న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (నీట్ ఎండీఎస్, 2024) పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. షెడ్యూలు ప్రకారం ఈ పరీక్ష ఈ నెల 18న జరగాల్సి ఉండగా, డెంటిస్టులు చిట్ట చివరి క్షణంలో ఈ పిటిషన్ను దాఖలు చేశారని వ్యాఖ్యానించింది.
నీట్-ఎండీఎస్కు అర్హత సాధించడం కోసం ఇంటర్న్షిప్ను పూర్తి చేయడానికి గడువు ఈ నెల 31 అని, దీనిని పొడిగించాలని పిటిషనర్లు కోరారు. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై స్పందిస్తూ.. కేంద్రం ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించినందు వల్ల ఈ సమస్య పరిష్కారమైందని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 మధ్య కాలంలో ఇంటర్న్షిప్ను పూర్తి చేసినవారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు అర్హులని కేంద్రం స్పష్టం చేసినట్లు ధర్మాసనం గుర్తు చేసింది.