పాట్నా, మే 8: ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య హత్య కేసులో దోషి అయిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను విడుదల చేయడంపై తమ ప్రతిస్పందన తెలియజేయాలని బీహార్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. కృష్ణయ్య భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌కు కూడా నోటీసు జారీ చేస్తూ దానిని సహారా జిల్లా ఎస్పీ ద్వారా అందజేయాలని ఆదేశించింది.
విచారణను తర్వాతి వారానికి వాయిదా వేసింది. 14 నుంచి 20 ఏండ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న దోషులకు క్షమాభిక్ష పెట్టి వారిని విడుదల చేయాలంటూ బీహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం ఇటీవల జైలు నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ఉత్తర్వుల మేరకు ఖైదీగా ఉన్న మాజీ ఎంపీ ఆనంద్‌ను జైలు నుండి విడుదల చేయడంతో దీనిని ప్రశ్నిస్తూ కృష్ణయ్య భార్య సుప్రీంను ఆశ్రయించారు.
ఐఏఎస్ అధికారి అయిన జీ కృష్ణయ్యను ముజఫర్‌నగర్‌లో డిసెంబర్ 5, 1994లో ఆనంద్ మోహన్ అనుచరులు దారుణంగా చంపారు. కాగా, తన భర్త హత్య కేసులో సుప్రీం న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన భార్య ఉమాదేవి ఆశాభావం వ్యక్తం చేశారు.