న్యూఢిల్లీ: ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసీయూ), క్రిటికల్ కేర్ సేవల కోసం కనీస ప్రమాణాలను నిర్దేశించే దేశవ్యాప్త విధానానికి సుప్రీంకోర్టు బుధవారం ఆమోదం తెలిపింది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, క్రిటికల్ కేర్ సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో దేశం దారుణమైన స్థితిలో ఉందని జస్టిస్‌లు అహసనుద్దీన్ అమానుల్లా, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.జనాభా విపరీతంగా పెరుగుతున్నదని, కానీ ఆరోగ్య వ్యవస్థ ఆ డిమాండ్‌ను అందుకోలేకపోతున్నదని వ్యాఖ్యానించింది.
ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వైద్య నిర్లక్ష్యం, దేశవ్యాప్తంగా ఏకరూప ఐసీయూ, క్రిటికల్ కేర్ ప్రమాణాలు లేకపోవడంపై 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న విచారణ నుంచి ఈ అంశం తెరపైకి వచ్చింది. అసలు అప్పీలు 2024లోనే ముగిసినప్పటికీ, దేశవ్యాప్తంగా ఐసీయూ మౌలిక సదుపాయాల ప్రామాణీకరణపై సుప్రీంకోర్టు పర్యవేక్షణను కొనసాగించింది.
కోర్టు గత కొన్ని నెలలుగా రాష్ర్టాలు, కేంద్రప్రభుత్వం, వైద్య నిపుణులతో కలిసి ఐసీయూ అడ్మిషన్, సిబ్బంది, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, రోగుల సంరక్షణ ప్రమాణాలను నియంత్రించే ఒక ఉమ్మడి ప్రణాళికను తయారు చేయడానికి పనిచేస్తున్నది. సిఫార్సులను సిద్ధం చేయడం కోసం నిపుణుల కమిటీని కూడా కోర్టు ఏర్పాటు చేసింది.
రాష్ర్టాలు, కోర్టు నియమించిన కమిటీ మధ్య మూడు అంచెల ఐసీయూ విధానంపై ఏకాభిప్రాయం కుదిరిందని ధర్మాసనం పేర్కొంటూ దానికి అధికారికంగా ఆమోదం తెలిపింది. మూడు అంచెల ఐసీయూ విధానంలో భాగంగా జీపీఎస్ ట్రాకింగ్, టెలీఐసీయూ అనుసంధానం, ప్రామాణిక అత్యవసర సంరక్షణ వ్యవస్థలతో కూడిన దేశవ్యాప్త హెల్త్‌కేర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో స్థానికంగా కనీస ఐసీయూ సదుపాయాలు అందుబాటులో ఉండేలా యంత్రాంగాలను సిద్ధం చేయాలని రాష్ర్టాలను కోర్టు ఆదేశించింది.
ఐసీయూ సదుపాయాలు ఉన్న అనుబంధ దవాఖాన 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం నర్సింగ్ కళాశాలలు పనిచేయడానికి అనుమతి ఉందనే సమాచారంపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఐసీయూ రోగులతో వ్యవహరించే నర్సింగ్ విద్యార్థులకు దవాఖానలకు దూరంగా ఉండే సంస్థలలో శిక్షణ ఇవ్వలేరని కోర్టు పేర్కొంది. చివరికి ఆ నర్సులు నిజమైన రోగులతో పని చేయాల్సి ఉంటుంది, అలాంటి బాధ్యతను వారికి సరైన శిక్షణ లేకుండా అప్పగించలేము అని అభిప్రాయపడింది.
నర్సింగ్ సంస్థలు ఐసీయూ సదుపాయాలు ఉన్న దవాఖానలతో అనుసంధానించబడి ఉండాలి లేదా ఒక కిలోమీటర్ పరిధిలో ఉండాలని బెంచ్ పేర్కొంది. తదుపరి విచారణకు ముందుగా నిబంధనల అమలు, కార్యాచరణ ప్రణాళికలను వివరిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని అన్ని రాష్ర్టాల ఆరోగ్య శాఖాధిపతులను కోర్టు ఆదేశించింది. నిబంధనలు పునఃసమీక్షించి కోర్టు ముందు సూచనలను ఉంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ ప్రక్రియ సామాన్యులకు ఆరోగ్య సంరక్షణ లభ్యతను మెరుగుపరుస్తుందని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది.