India : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ఇవాళ్టితో తెరపడింది. కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) ఒక ప్రకటన చేశారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు.
ఇవాళ మధ్యాహ్నం 3.35 గంటలకు పాకిస్థాన్ డీజీఎంవో, భారత డీజీఎంవో మధ్య ఫోన్లో చర్చలు జరిగాయని, రెండు దేశాలు కాల్పుల విరమణను అంగీకరించాయని మిస్రీ వెల్లడించారు. ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు ఇరుదేశాల డీజీఎంవోలు మళ్లీ చర్చలు జరుపుతారని చెప్పారు. ఈ సాయంత్రం నుంచి భూ, గగన, సముద్ర తలాల నుంచి ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని తెలిపారు.
కాగా, భారత విదేశాంగ శాఖ ప్రకటనకు కొద్ది సేపటి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో సంచలన ప్రకటన చేశారు. భారత్, పాకిస్థాన్ దేశాలు పూర్తిస్థాయి కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని తెలిపారు. అమెరికా రెండు దేశాలతో రాత్రంతా జరిపిన చర్చలు ఫలించాయని పేర్కొన్నారు. కాల్పుల విరమణకు అంగీకరించినందుకు రెండు దేశాలను అభినందించారు.