గురుగ్రామ్: మూడు కుటుంబాలు కలిసి సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లాయి. భోజనం తర్వాత మౌత్ ఫ్రెష్నర్ తిన్నారు. అంతే, ఒక్కసారిగా కడుపులో విపరీతమైన నొప్పి, క్షణాల్లో రక్తపు వాంతులు చేసుకున్నారు. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల అస్వస్థతకు మౌత్ ఫ్రెషనరే కారణమని, ఇందులో ప్రమాదకరమైన డ్రై ఐస్ కలిసిందని డాక్టర్లు గుర్తించారు. పోలీసులు రెస్టారెంట్ మేనేజర్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. పొరపాటున మౌత్ ఫ్రెష్నర్, డ్రై ఐస్ కలిసిపోయిందని మేనేజర్ అంగీకరించాడు.
డ్రై ఐస్ అనేది కార్బన్ డయాక్సైడ్కు ఘన రూపం. ఇది -78 డిగ్రీల ఉష్ణోగ్రతతో అత్యంత చల్లగా ఉంటుంది. సాధారణంగా ఇది ఐస్ క్రీమ్, ఫ్రోజెన్ డెజర్ట్‌లను చల్లగా ఉంచేందుకు వినియోగిస్తారు. నేరుగా దీనిని తాకడం, తినడం ప్రమాదకరం. ఇది ఒకేసారి వెచ్చటి ఉష్ణోగ్రతలోకి చేరితే కార్బన్ డయాక్సైడ్ వాయువు ఉత్పత్తి అవుతుంది. శరీరంలోకి డ్రై ఐస్ వెళ్లినప్పుడు కూడా ఇదే జరిగి ఆక్సిజన్ స్థానంలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతుంది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.