Sanjay Raut : భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో దేశ ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖులు భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేశారు. కానీ కొందరు మాత్రం ఈ విజయంపై స్పందించలేదు.
దాంతో భారత జట్టును అభినందించని వారిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. వారంతా పాకిస్థాన్ సపోర్టర్లు అని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. బీజేపీ పేరును ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. నిజమైన జాతీయవాదులు అసలు నిన్నటి మ్యాచ్‌ను చూడనే చూడరని ఆయన వ్యాఖ్యానించారు.
మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా భారత క్రికెట్ జట్టు ట్రోఫీని స్వీకరించకపోవడం అనేది ఒక పెద్ద డ్రామా అని విమర్శించారు. భారత క్రికెట్ జట్టు సభ్యులు 10 రోజుల క్రితం మోసిన్ నఖ్వీతో కరచాలనం చేసిన ఘటనకు సంబంధించిన వీడియోను తాను ఎక్స్ ఖాతాలో పోస్టు చేశానని చెప్పారు. అప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి, ఇప్పుడు ట్రోఫీని నిరాకరించడం డ్రామా కాకపోతే మరేందని ప్రశ్నించారు.
అసలు పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడేందుకు ఒప్పుకుని భారత్.. మనదేశపు సైన్యాన్ని, పహల్గామ్ మృతులను, మృతుల కుటుంబాలను అవమానించిందని రౌత్ వ్యాఖ్యానించారు. మ్యాచ్ ఆడటం ఎందుకు, ట్రోఫీని నిరాకరించడం ఎందుకు..? అని ఆయన ప్రశ్నించారు.