న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, సీట్ల సంఖ్యపై విధించిన నిబంధనలను పునః పరిశీలించి, సవరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి సూచించింది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విధించిన నిబంధనలు, ఇతర అంశాల అధ్యయనానికి ఎంపీలతో ఏర్పాటు చేసిన కమిటీ ‘ప్రాంత నిర్దిష్ట నిబంధనలు’ పేరుతో దక్షిణాది రాష్ర్టాలకు జరుగుతున్న అన్యాయం, వారు కొత్తగా మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయలేని పరిస్థితిపై ప్రభుత్వానికి ఇటీవల నివేదిక అందించింది. ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలన్న ఎంఎన్సీ నిబంధనలను అనుసరిస్తే దక్షిణాది రాష్ర్టాల్లో ఎక్కడా కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు కాదని స్పష్టం చేసింది. ఎందుకంటే ప్రతి దక్షిణాది రాష్ర్టాల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య జనాభా ఆధారిత ఫార్ములా ఇప్పుడు ఎంఎన్సీ సూచించిన దానికంటే ఎక్కువగా ఉంది.
ఉదాహరణకు తెలంగాణలో 2021 నాటికి 3.77 కోట్ల జనాభాకు 8,540 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఏపీలో 5.27 కోట్లకు 6,435 సీట్లు, తమిళనాడులో 7.64 కోట్లకు 11,600 సీట్లు, కర్ణాటకలో 6.68 కోట్లకు 11,695 సీట్లు, కేరళలో 3.54 కోట్లకు 4,665 సీట్లు ఉన్నాయి. అయితే ఎన్ఎంసీ నూతన నిబంధనల ప్రకారం చూస్తే తమిళనాడుకు గరిష్ట ఎంబీబీఎస్ సీట్లు 7,600, కర్ణాటకకు 6,700, కేరళకు 3,500, తెలంగాణకు 3,700, ఏపీకి 5,300 సీట్లు మాత్రమే ఉండాలి. అయితే వీటి కన్నా ఎక్కువగానే ఇప్పటికే ఆయా రాష్ర్టాల్లో సీట్లు ఉన్నాయి. రానున్న పాతికేండ్లలో చిన్న పిల్లల వైద్యులు, కంటి వైద్యులు, నాడీ వ్యవస్థ శస్త్ర చికిత్స నిపుణులు, ఇతర స్పెషలిస్టు వైద్యుల అవసరాన్ని అంచనా వేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. సాధారణ చికిత్స, ఫార్మా, అనాటమీ సీట్ల కంటే ఈ విభాగాల వైద్యుల అవసరం ఎక్కువగా ఉందన్నారు.