న్యూఢిల్లీ, ఆగస్టు 20: విద్య కాషాయీకరణపై ఎన్ని రాజకీయ విమర్శలు వస్తున్నా అధికారంలోని బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో ఇప్పటికే కొంత విజయం సాధించిన మోదీ ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా రాజకీయ శాస్ర్తానికి సంబంధించి 11, 12 తరగతుల పాఠ్య ప్రణాళికల పునర్వ్యవస్థీకరణకు జాతీయ విద్య, పరిశోధన మండలి (ఎన్సీఈఆర్టీ) ఏర్పాటుచేసిన పాఠ్యపుస్తక అభివృద్ధి బృందంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ అనుబంధ సంస్థలైన ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్కు చెందిన కనీసం నలుగురు సభ్యులకు ఈ కమిటీలో స్థానం కల్పించారు. ఎన్సీఈఆర్టీ పునర్వ్యవస్థీకరించిన 16 మంది సభ్యుల ఈ టీమ్ 11వ తరగతి పాఠ్య పుస్తకాన్ని ఈ ఏడాది నవంబర్‌లోగా, 12వ తరగతిది వచ్చే ఏడాది జూలైలోగా తప్పనిసరిగా అభివృద్ధి చేయాలి.
విద్యావేత్త, రాజకీయ విశ్లేషకుడు, కర్ణాటకలోని డీమ్డ్ యూనివర్సిటీ నిట్టేకు ఉపాధ్యక్షుడిగా ఉన్న సందీప్ శాస్త్రి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. సభ్యులుగా యదునాథ్ దేశ్‌పాండే, వందనా మిశ్రా, ప్రశాంత్ దివేకర్, రవి రామచంద్ర శుక్లా తదితరులు ఉన్నారు. ప్రస్తుతం నియమించిన సభ్యులలో విద్యాశాఖ సీనియర్ కన్సల్టెంట్‌గా ఉన్న యదునాథ్ దేశ్‌పాండే ఏబీవీపీలో నమోదైన సంస్థాగత నేపథ్యం ఉంది. ప్రశాంత్ దివేకర్ పుణెలో పనిచేస్తున్న జ్ఞాన ప్రబోధిని సంస్థకు ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉంది. జేఎన్‌యూ సెంటర్ పొలిటికల్ స్టడీస్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వందనా మిశ్రా ఏబీవీపీ మాజీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జేఎన్‌యూ అసోసియేట్ ప్రొఫెసర్ రవి రమేశ్ చంద్ర శుక్లా ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్న ఒక జర్నల్ ఎడిటోరియల్ బోర్డులో పనిచేశారు.
ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పాఠశాల విద్యలో చొప్పించడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని పలు విపక్షాలు, విద్యార్థి సంఘాలు ఎన్సీఈఆర్టీ తీరును విమర్శించాయి. సంఘీకరణకు (సంఘ్ పరివార్ భావజాలాన్ని తీసుకు రావడం) ఎన్సీఈఆర్టీ ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. కమిటీ రూపకల్పన చూస్తే పాఠ్యపుస్తక రూపకల్పన ప్రక్రియ రాజకీయ స్వతంత్రతపై ఆందోళన కలుగుతున్నదని కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ పేర్కొన్నారు. బీజేపీ అనుబంధ సంస్థలకు చెందిన వారిని కమిటీలో ఉంచడం పట్ల ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజలను అర్థ అక్షరాస్యులుగా ఉంచడం బీజేపీ లక్ష్యమని, అందుకే ఇటీవల ప్రధాని మోదీ ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలు చేశారని టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ విమర్శించారు. చదవడం, రాయడం నేర్చుకుంటే ప్రజలు తనను ప్రశ్నించడం ప్రారంభిస్తారన్న భయంతో వారిలో సంఘ్ భావజాలం నింపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఎన్సీఈఆర్టీ పునర్ వ్యవస్థీకరించిన పాఠ్యపుస్తక అభివృద్ధి బృందంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ వ్యవస్థతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉండటాన్ని ఎన్ఎస్యూఐ తీవ్రంగా విమర్శించింది. అటువంటి సభ్యుల ఉనికి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, లౌకిక వాదం, సమాఖ్య వాదం, సామాజిక న్యాయం వంటి అంశాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాల సైద్ధాంతిక ధోరణిని కచ్చితంగా ప్రభావితం చేస్తుందని ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖర్ ఆరోపించారు. ప్రస్తుతమున్న కమిటీని రద్దు చేసి స్వతంత్ర విద్యావేత్తలు, రాజకీయ శాస్త్ర పండితులు, రాజ్యాంగ నిపుణులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో తాజాగా కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.