ఇంఫాల్, ఫిబ్రవరి 5: మణిపూర్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి తొలిరోజే నిరసన సెగ తగిలింది. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నెంచా కిప్జెన్కు వ్యతిరేకంగా కుకీ గ్రూపులు శుక్రవారం మణిపూర్ బంద్కు పిలుపునిచ్చాయి. కుకీ-జో తెగకు చెందిన సభ్యులు బుధవారం సాయంత్రం ఢిల్లీలోని మణిపూర్ భవన్ ఎదుట నిరసన తెలిపారు. కుకీ తెగకు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బంద్ పాటిస్తున్నట్లు జాయింట్ ఫోరమ్ ఆఫ్ సెవన్(జెఎఫ్7) ప్రకటించాయి.
తమ సమిష్టి నిర్ణయానికి వ్యతిరేకంగా కుకీ తెగకు చెందిన ఏ ఎమ్మెల్యే అయినా ప్రభుత్వంలో చేరితే జరిగే పర్యవసనాలకు తమ సంస్థ బాధ్యత తీసుకోదని కుకీ-జో కౌన్సిల్ హెచ్చరించింది. ప్రభుత్వంలో చేరవద్దని తమ ఎమ్మెల్యేలను కొన్ని కుకీ గ్రూపులు కూడా హెచ్చరించాయి. ముఖ్యమంత్రిగా వై ఖేమ్చంద్ సింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కుకీ తెగ నుంచి నెంచా కిప్జెన్ నియమితులు కావడంతో బుధవారం కంగ్పోక్పీ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ నిరసనకారులు లీమాఖోంగ్ సమీపంలో రోడ్లను అడ్డగించి టైర్లను కాల్చారు.