హైదరాబాద్, జూలై 24 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పదవిలో ఉండగా ఉప రాష్ట్రపతి రాజీనామా చేసినా, మరణించినా, ఆయన్ని తొలగించినా సాధ్యమైనంత త్వరగా అంటే గరిష్ఠంగా 60 రోజుల్లో తదుపరి ఉప రాష్ట్రపతిని నియమించాలని రాజ్యాంగంలోని 68వ అధికరణంలోని క్లాజ్ 2 పేర్కొంటున్నది. ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టిన వ్యక్తి మిగిలిన కాలానికి కాకుండా పదవిని చేపట్టిన రోజు నుంచి మొత్తం ఐదేండ్లు ఆ పదవిలో కొనసాగుతారు.
ఉప రాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకొంటుంది.పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రస్తుతం ఉన్న 782 మంది సభ్యులు ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. కనీసం 392 మంది సభ్యుల మద్ధతు కలిగిన అభ్యర్థి ఉప రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. ఉభయ సభల్లో ఎన్డీఏకు ప్రస్తుతం 426 మంది ఎంపీల బలం ఉన్నది. ఇండియా కూటమికి 312 మంది సభ్యుల బలం ఉన్నది.