అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో నూతనంగా నిర్మించిన రామాలయానికి 2024 జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. అందుకోసం ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. దానికి ముందు ప్రధాని నరేంద్రమోదీ నగరంలో పునరుద్ధించిన అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్‌ను, కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. డిసెంబర్ 30న ఈ ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ‘అయోధ్య రైల్వే జంక్షన్’గా ఉన్న అయోధ్య రైల్వే స్టేషన్ పేరును ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా మార్చారు. ఇప్పుడు విమానాశ్రయం పేరును కూడా మార్చనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయోధ్యలోని అంతర్జాతీయ విమానాశ్రయం పేరును ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు’గా మార్చనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.