SIR | ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 10న సుప్రీంకోర్టు విచారించనున్నది. ఈ కేసులో దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యల చెల్లుబాటును పరిశీలించనున్నట్లు పేర్కొంది. పలువురు పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వినిపించిన వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ జోయ్మల్యా బాగ్జి బెంచ్ గురువారం కేసును విచారించేందుకు అంగీకరించింది.
ఈ పిటిషన్లపై ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేయాలని బెంచ్‌ను సిబల్ కోరగా.. విచారణ జరుగుతుందని జస్టిస్ సుధాన్షు తెలిపారు. బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను సవాల్ చేస్తూ ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాతో పాటు ఏడీఆర్ సంస్థ పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను వెంటనే అమలు చేయాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని మనోజ్ ఝా కోరారు.
ఈసీ ఉత్తర్వులు ఉత్తర్వు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 21 (జీవించే హక్కు-వ్యక్తిగత స్వేచ్ఛ), ఆర్టికల్ 325 (కులం, మతం, లింగం ఆధారంగా ఎవరినీ ఓటరు జాబితా నుంచి మినహాయించకూడదు), ఆర్టికల్ 326 (18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు)లను ఉల్లంఘిస్తుందని.. ఆదేశాలను రద్దు చేయాలని మనోజ్ ఝా కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) రాజ్యాంగంలోని నిబంధనలు ఉల్లంఘించిందని ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఇది ఇలాగే కొనసాగితే దేశంలో పెద్ద సంఖ్యలో ఓట్లు కోల్పోయే అవకాశం ఉంటుందని పేర్కొంది. ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలను బలహీనంగా మారుస్తుందన్నారు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) సైతం పిటిషన్ దాఖలు చేసింది.