న్యూఢిల్లీ, ఆగస్టు 14: డాక్టర్లు తప్పనిసరిగా జనరిక్ ఔషధాలనే రాయాలన్న జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధన అమలును వాయిదా వేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ ఔషధాల నాణ్యత, మార్కెట్లో లభ్యత తదితర విషయాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్ఎంసీ సిఫారసు చేయడం రోగుల ఆరోగ్యంతో చెలగాటమాడటమేనని విమర్శించింది.
జనరిక్ ఔషధాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావాలని, అప్పటి వరకు ఎన్ఎంసీ సిఫారసులను అమలు చేయొద్దని సూచించింది. కాగా, జనరిక్ ఔషధాలు రాయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కొంతకాలం వైద్యుల లైసెన్స్‌ను నిలిపివేస్తామని ఎన్ఎంసీ ఇటీవల ఆదేశాలు జారీచేసింది.