కోటా, జనవరి 6: ‘ఎరక్క పోయి వచ్చాను.. ఇరుక్కు పోయాను’ అన్నట్టుగా మారింది రాజస్ధాన్లోని ఒక దొంగ పరిస్థితి. కోటాలో నివసించే సుభాష్ కుమార్ రావత్ కుటుంబంతో కలిసి ఊరెళ్లాడు. ఎవరూ లేని ఆ ఇంట్లో చోరీ చేసేందుకు వంటగది ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నం నుంచి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఒక దొంగ అందులో ఇరుక్కుపోయాడు. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక త్రిశంకు నరకంలో వేలాడాడు. మరునాడు యజమాని భార్య ఇంటికి రాగా, వంటగది ఎగ్జాస్ట్లో ఇరుక్కుపోయిన వ్యక్తిని గమనించి కేకలు వేసి చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు పోలీసులను రప్పించగా, వారు గంట పాటు కష్టపడి ఆ యువకుడిని బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు. చోరీకి వచ్చిన ఆ వ్యక్తి తనను ఎవరూ అనుమానించకుండా పోలీస్ స్టిక్కర్ ఉన్న కారులో వచ్చాడని, అతనితో పాటు చోరీకి వచ్చిన ఇంకొక వ్యక్తి ఏదో శబ్దం రావడంతో పారిపోయాడని చెప్పారు.