న్యూఢిల్లీ : పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు చివరికి కండోమ్‌ల ఉత్పత్తులపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కండోమ్‌ల ప్రాథమిక నిర్మాణం సహజ రబ్బరు లాటెక్స్పై ఆధారపడినప్పటికీ, తుది ఉత్పత్తిని సిద్ధం చేయడానికి చమురు నుంచి సేకరించే మిశ్రమం ఎంతో అవసరం అవుతుంది. ముడి చమురు ధరలు పెరిగిన కారణంగా కండోమ్‌ల తయారీకి అవసరమైన లూబ్రికెంట్లు, సింథటిక్ రబ్బర్, స్టెబిలైజింగ్ కెమికల్స్ వ్యయం పెరుగుతున్నది.
కండోమ్‌ల లూబ్రికేషన్ కోసం తయారీదారులు సిలికాన్ ఆయిల్‌పై, ప్యాకేజింగ్ కోసం అల్యూమినియం ఫాయిల్స్, ప్లాస్టిక్ ఫిల్మ్‌లపై అధికంగా ఆధారపడుతుంటారు. వీటి ధరలు పెరిగిన కారణంగా కండోమ్ ఉత్పత్తుల రిటైల్ ధరలను పెంచడం తప్పనిసరి అవుతున్నదని భారత్‌కు చెందిన హెల్త్‌కేర్ కంపెనీ ‘మ్యాన్‌కైండ్ ఫార్మా’ తెలిపింది. పెరిగిన ముడిసరుకు ఖర్చుల భారాన్ని వినియోగదారులపై మోపడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.