న్యూఢిల్లీ: పోస్టు గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్(పీజీడబ్ల్యూపీ) వీసా ప్రోగ్రామ్లో కీలక మార్పులు చేసేందుకు కెనడా ప్రభుత్వం సిద్ధమైంది. ఉద్యోగులు, కార్మికుల కొరత ఉన్న రంగాలకు సంబంధించిన కోర్సుల గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పీజీడబ్ల్యూపీ ప్రోగ్రామ్ లబ్ధి పరిమితం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నది. దీని ద్వారా ఆయా రంగాల్లో కార్మికుల కొరత సమస్యను పరిష్కరించొచ్చని సర్కార్ భావిస్తున్నట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
కెనడాలోని ప్రైవేటు కాలేజీల్లో ఎన్రోల్ అయివున్న విద్యార్థులు ఇకపై ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి పీజీడబ్ల్యూపీ లబ్ధికి ఆటోమేటిక్గా అర్హత సాధించే అవకాశం ఉండబోదు. ఈ విధమైన మార్పులతో భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడునున్నది. కెనడాలో చదువుకొంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో 40 శాతం వరకు భారతీయులే ఉంటారు.