IndiGo | ఇండిగో సేవలు స్తంభించాయి. గత ఐదురోజుల్లో 2వేలకుపైగా విమానాలు రద్దయ్యాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రద్దు చేసిన విమానాలకు సంబంధించిన రీఫండ్ ప్రక్రియను ఆదివారం సాయంత్రం వరకు పూర్తి చేయాలని విమానయాన సంస్థను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శనివారం ఆదేశించింది. ప్రయాణీకుల లగేజీని రాబోయే రెండు రోజుల్లో డెలివరీ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ చెప్పింది. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో వెయ్యికపైగా విమానాలను రద్దు చేసింది. రీఫండ్ విషయంలో ఆలస్యం జరిగినా.. నిబంధనలు పాటించకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రద్దయిన, అంతరాయం కలిగిన అన్ని విమానాలకు రీఫండ్ ప్రక్రియను ఆదివారం రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
రద్దు కారణంగా ప్రయాణం ప్రభావితమైన ప్రయాణీకుల నుంచి ఎలాంటి రీషెడ్యూలింగ్ ఫీజులను సైతం వసూలు చేయొద్దని స్పష్టం చేసింది. ఇటీవల వరుసగా విమానాలను ప్రభావితమవుతున్న విషయం తెలిసిందే. దాంతో విమానాల రద్దు నేపథ్యంలో రీఫండ్‌ను ఆటోమేటిక్‌గా తిరిగి ఇవ్వనున్నట్లు ఇండిగో స్పష్టం చేసింది. డిసెంబర్ 5, డిసెంబర్ మధ్య రద్దు, రీషెడ్యూల్ అభ్యర్థనలను తాము పూర్తిగా గౌరవిస్తామని ఇండిగో పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో శనివారం 400కుపైగా విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికులకు ప్రత్యేకంగా సహాయం, సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ సెల్ ప్రస్తుత సంక్షోభం కారణంగా ప్రభావితమయ్యే ప్రయాణీకులను ముందస్తుగా స్పందించి రీఫండ్ లేదంటే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు చెబుతుందని ప్రభుత్వం ఆదేశించింది. కార్యకలాపాలు పూర్తిగా సాధారణ పరిస్థితి చేరే వరకు ఆటోమేటిక్ రీఫండ్ వ్యవస్థ యాక్టివ్‌గా ఉండాలని.. విమాన రద్దు, ఆలస్యం కారణంగా ప్రయాణికులు అందుకోలేకపోయిన వారి లగేజీని రాబోయే 48 గంటల్లో తిరిగి ఇచ్చేలా చూడాలని ఇండిగోను మంత్రిత్వశాఖ ఆదేశించింది.