న్యూఢిల్లీ: అమెరికా ప్రారంభించిన ప్రపంచ సుంకాల యుద్ధం కారణంగా భారత సాఫ్ట్వేర్ రంగంలో కొత్త ఉద్యోగుల నియామకానికి బ్రేక్ పడింది. టీమ్‌లీజ్ డాటా ప్రకారం గత త్రైమాసికంతో పోలిస్తే ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత టెక్ రంగంలో టాలెంట్ డిమాండ్ 18-20% తగ్గింది. ఎక్సెనో డాటా ప్రకారం ఫిబ్రవరిలో 80 వేలుగా ఉన్న ఐటీ నియామకాల డిమాండ్ మార్చి నాటికి 55 వేలకు పడిపోయింది. మరోవైపు ఇండియన్ టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని ఎక్సెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కారంత్ అభిప్రాయపడ్డారు.
మార్చి నెలలో సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ స్టార్టప్‌లలోనూ ఉద్యోగాల నియామకాలు 5 వేలు దాకా తగ్గాయి. ఐటీ సెక్టార్లో ఓవరాల్ జాబ్ డిమాండ్ 45 నుంచి 40 శాతానికి తగ్గింది. ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించే అవకాశం వెంటనే లేకపోయినా సాధారణ స్థాయిలో కోతలు ఉండే అవకాశం ఉంది. అమెరికా రక్షణాత్మక విధానాలు సాంకేతిక వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి సారిస్తాయి. ఈ నేపథ్యంలో స్వల్పకాల ఒడిదొడుకులను అధిగమించడంపై భారత టెక్ దిగ్గజాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.
ఇన్ఫోసిస్‌లో 240 మంది ట్రైనీల తొలగింపు
అంతర్గత మదింపు పరీక్షలో విఫలమైన 240 మంది ట్రైనీలను ఇన్ఫోసిస్ తొలగించింది. ఈ మేరకు వారికి శుక్రవారం ఈ-మెయిల్ పంపింది. అదనపు ప్రిపరేషన్ టైమ్ ఇచ్చినా జనరిక్ ఫౌండేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ఫెయిల్ అయినందుకు వారిని తొలగిస్తున్నట్టు పేర్కొంది. అయితే బీపీఎం ఇండస్ట్రీలో ఉద్యోగాలు వెతుక్కొనేందుకు అవసరమైన శిక్షణను తమ సంస్థ ద్వారా వారికి అందిస్తామని వెల్లడించింది.