న్యూఢిల్లీ, జూన్ 30: ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. పార్టీ నుంచి ఉన్న 55 మందిలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బృందంలోనే ఉండటం ఆ పార్టీ మనుగడపై అనుమానాలను పెంచుతున్నది. 56 ఏండ్ల శివసేన చరిత్రలో చీలికలు కొత్తేమీ కాదు. శివసేన సీనియర్ నేతలు ఛాగన్ భుజ్‌బల్(1991), నారాయణ్ రాణే(2005), రాజ్ ఠాక్రే(2006) పార్టీ నుంచి వెళ్లిపోయారు. అయితే, అప్పుడు తిరుగుబాటు వర్గం అంత బలంగా లేదు. వాళ్లకు జనం మద్దతు లేదు. పైగా, అప్పుడు బాల్ ఠాక్రే బతికి ఉన్నారు. అందుకే భుజ్‌బల్, నారాయణ్ రాణే, రాజ్‌ఠాక్రే ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ ప్రస్తుత పరిస్థితి వేరు. బాల్ ఠాక్రే లేరు. తిరుగుబాటు వర్గం బలంగా ఉంది.
షిండేను ప్రజలు నమ్మరు
శివసేన నుంచి తాము వెళ్లిపోబోమని ఏక్నాథ్ షిండే వర్గం ప్రకటించింది. ఒక వేళ షిండే వర్గం శివసేనలోనే కొనసాగితే పార్టీలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయి. ముఖ్యమంత్రిగా షిండే పార్టీని, కార్యకర్తలను మరింత నియంత్రణలోకి తెచ్చుకొనే అవకాశం ఉంటుంది. అయితే, షిండే ప్రస్తుతం సీఎం పీఠం ఎక్కినప్పటికీ తిరుగుబాటు నేతగా, పార్టీకి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారని, ఆయనను ప్రజలు నమ్మరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, బాలా సాహెబ్ కుమారుడన్న సానుభూతి ఉద్ధవ్‌పై ఉంటుందని ఇది భవిష్యత్తులో రాజకీయంగా ఉద్ధవ్‌కు కలిసొస్తుందని విశ్లేషిస్తున్నారు.
మరో రాష్ర్టాన్ని కోల్పోయిన కాంగ్రెస్
మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పతనంతో కాంగ్రెస్ మరో రాష్ట్రంలో అధికారం కోల్పోయినట్టయింది. ప్రస్తుతం ఆ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో సొంతంగా అధికారంలో ఉండగా, జార్ఖండ్‌లో జేఎఎంతో కలిసి అధికారం పంచుకుంటున్నది. ఇటీవల జరిగిన ఐదురాష్ర్టాల ఎన్నికల్లో హస్తం పార్టీకి ఘోరపరాభవం ఎదురైంది. పంజాబ్‌లో అధికారం కోల్పోగా.. యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకోవడంలోనూ విఫలమైంది.