న్యూఢిల్లీ: దేశంలో సంతానోత్పత్తి రేటు(టీఎఫ్ఆర్) దశాబ్దాల్లో మొదటిసారిగా రీప్లేస్మెంట్ స్థాయి కంటే కిందికి పడిపోయింది. కేంద్ర హోం శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం ప్రచురించిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్ట్ 2024’ ప్రకారం.. దేశంలో సంతానోత్పత్తి రేటు క్షీణించింది. రాబోయే సంవత్సరాల్లో దేశ జనాభా పెరుగుతుందని భావిస్తున్నప్పటికీ సంతానోత్పత్తి స్థాయి మళ్లీ 2.15 కంటే పైకి పెరుగకపోతే, దాని వృద్ధిలో క్రమంగా క్షీణత కనిపిస్తుంది. భారతదేశ రీప్లేస్మెంట్ స్థాయి 2.1 బెంచ్మార్క్ కంటే కిందకు పడిపోయిందని నివేదిక పేర్కొన్నది. రీప్లేస్మెంట్ లెవల్ అంటే జనాభా పెరుగకుండా లేదా తగ్గకుండా ఒక తరం నుంచి మరో తరానికి తనను తాను పునఃస్థాపించుకోవడానికి ప్రతి మహిళ కలిగి ఉండాల్సిన పిల్లల సంఖ్య.
ఒక దేశం సంతానోత్పత్తి రేటు చాలా కాలం పాటు ఈ స్థాయి కంటే తక్కువగా ఉంటే జనాభా క్రమంగా క్షీణిస్తుంది. వాషింగ్టన్కు చెందిన ‘ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్’ నిపుణుల అంచనా ప్రకారం.. భారత జనాభా 21 ఏండ్లలో అత్యధిక స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత తీవ్రమైన క్షీణత ప్రారంభమవుతుంది. శతాబ్దం చివరి నాటికి దేశ జనాభా ఒక బిలియన్(100 కోట్లు) కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు.
ఇది దాదాపు అర బిలియన్(50 కోట్లు) ప్రజల తగ్గుదలను సూచిస్తున్నది. దేశవ్యాప్తంగా కేవలం ఆరు రాష్ర్టాలు మాత్రమే ఈ రీప్లేస్మెంట్ మార్కు కంటే ఎక్కువ సంతానోత్పత్తి రేట్లను కలిగి ఉన్నాయి. ఢిల్లీ దేశంలోనే అత్యల్పంగా 1.2 టీఎఫ్ఆర్ నమోదు చేసింది. ఇది ఫిన్లాండ్(1.3 టీఎఫ్ఆర్) కంటే తక్కువని నివేదిక పేర్కొన్నది.
21వ శతాబ్దంలో కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రోత్సహించే అనేక అంశాలు ఉన్నాయి. ప్రస్తుత భారతీయ తల్లిదండ్రుల మారుతున్న ఆశయాలు దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి. పిల్లల విద్యావకాశాల కోసం, పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా చాలామంది ఆధునిక జంటలు ఒకే బిడ్డను ఎంచుకొంటున్నాయి.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించిపోతుండడం, పట్టణీకరణ, ఉపాధి విధానాల్లో మార్పుల కారణంగా ప్రస్తుతం సుమారు 70 శాతం మంది ప్రజలు విడివిడిగా(న్యూక్లియర్ ఫ్యామిలీస్) నివసిస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు చూపిస్తున్నాయి. ఫలితంగా పిల్లలను పెంచడం తల్లిదండ్రులపై ఎక్కువ ఒత్తిడి కలిగిస్తున్నది. ఇది తక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా వారిని ప్రోత్సహిస్తున్నది.
టీఎఫ్ఆర్ స్థాయి తగ్గడానికి మరొక ముఖ్యమైన కారణం సాంస్కృతిక మార్పు. గ్రామీణ ప్రాంతాల్లో కేబుల్ టెలివిజన్ రాక వల్ల కొన్నేండ్లుగా గర్భధారణలు తగ్గుముఖం పట్టాయని నివేదిక పేర్కొన్నది. చిన్న కుటుంబాలను ప్రోత్సహించే మహిళలను చూపే టెలివిజన్ ధారావాహికలతో సంతానోత్పత్తి రేటు క్షీణత ముడిపడి ఉన్నదని నిఫుణులు అంటున్నారు.
ఈ జనాభా మార్పు విభిన్న సామాజిక సవాళ్లను తెచ్చిపెడుతుంది. కాలక్రమేణా, నిరంతర తక్కువ సంతానోత్పత్తి రేటుతో వృద్ధుల సంఖ్య ఎక్కువవుతుంది, శ్రామిక శక్తి తగ్గుతుంది. సామాజిక సంక్షేమ వ్యవస్థలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది.
భారత్లో పరిస్థితిపై టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో అత్యంత విద్యావంతులైన వారిలో జననాల రేటు చాలా ఏండ్ల క్రితమే రీప్లేస్మెంట్ కంటే కిందికి పడిపోయిందని పేర్కొన్నారు.