న్యూఢిల్లీ, జూన్ 12: కేంద్ర వ్యవసాయ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ నియామకాన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయన నియామకంపై నిరసన వ్యక్తం చేస్తూ రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో 2017 జూన్‌లో మందసౌర్‌లో జరిగిన ఆరుగురు రైతుల హత్యకు ఆయనే బాధ్యుడని పేర్కొన్నది. కనీస మద్దతు ధర, రైతు రుణాల మాఫీ కోరుతూ జరిగిన భారీ ఆందోళనలో పాల్గొన్న రైతులను హత్య చేశారని ఆరోపించింది.
శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నియమిస్తూ బీజేపీ సర్కార్ తీసుకొన్న నిర్ణయం స్పష్టమైన మెజార్టీతో గత రెండు పర్యాయాలు చూపిన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నదని ఎస్కేఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా రైతులు, గ్రామీణ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నది. 2017, జూన్ 6న శివరాజ్ సింగ్ పాలనలో మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించారు.
జూలై 10న సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని, ఈ భేటీకి దేశవ్యాప్తంగా రైతు సంఘాల నేతలు పాల్గొంటారని ఎస్కేఎం తెలిపింది. దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యల నివారణ కోసం లేదా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కనీస మద్దతు ధర విషయంలో మోదీ మూడో ప్రభుత్వ మొదటి క్యాబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించింది.