బెంగళూరు, జూన్ 13: నష్ట పరిహారం చెల్లింపులో జాప్యంపై జరిగిన వాగ్వాదం శనివారం కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఘర్షణకు దారి తీసింది. నిర్వాసితుడైన ఓ రైతు అక్కడి సిబ్బందిపై చెప్పుతో దాడి చేసినట్లు తెలుస్తున్నది. తన భూమిని కోల్పోయిన బసప్ప అనే రైతు పరిహారం కోరుతూ సంబంధిత కార్యాలయానికి వచ్చాడు.
ఇతరుల పట్ల పక్షపాతం చూపుతున్న అధికారులు తన విషయంలో మాత్రం నిరంతరం జాప్యం చేస్తున్నారని అతడు ఆరోపించాడు. బసప్పకు, ఫస్ట్ డివిజన్ అసిస్టెంట్ అంకద్కు మధ్య ఈ విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా వారిద్దరూ పరస్పరం భౌతిక దాడికి పాల్పడ్డారు. అంకద్ను బసప్ప చెప్పుతో కొట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతలో అధికారులు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు.