CJI BR Gavai | ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో రాజ్యాంగ ప్రవేశిక పార్క్ ప్రారంభోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఒకే రాజ్యంగం అవసరమన్నారు. దేశంలో ఒకే రాజ్యాంగం అమలయ్యేలా ఆర్టికల్ 370ని తొలగించాలని పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని తాము ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు.
దేశంలోని ఒక రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతానికి అనుగుణంగా లేదని.. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఒకే రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఊహించారని జస్టిస్ బీఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగమనే ఆలోచనను ఆయన ఎప్పుడూ ఇష్టపడలేదని పేర్కొన్నారు. ఆర్టికల్ 370ని సవాల్ చేసిన సమయంలో.. కేసు విచారణకు వచ్చినప్పుడు అది తమ ముందుకు వచ్చిందని.. విచారణ సమయంలో ఒక దేశానికి ఒకే రాజ్యాంగం సరిపోతుందని తెలిపారు. మనం దేశాన్ని ఐక్యంగా ఉంచాలనుకుంటే మనకు ఒకే రాజ్యాంగం అవసరమని డాక్టర్ అంబేద్కర్ చెప్పిన మాటలను తాను గుర్తు చేసుకున్నానన్నారు.
రాజ్యాంగం సమాఖ్యవాదాన్ని అందిస్తుందని, యుద్ధ సమయాల్లో దేశం ఐక్యంగా ఉండకపోవచ్చని డాక్టర్ అంబేద్కర్‌ను విమర్శించారని గుర్తు చేశారు. రాజ్యాంగం అన్ని సవాళ్లకు అనుగుణంగా ఉంటుందని, దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని ఆయన ప్రతిస్పందించారని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ ‘మన 75 సంవత్సరాల ప్రయాణంలో చుట్టూ ఉన్న పొరుగుదేశాల్లో పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. భారతదేశం ఏదైనా సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా దేశం ఐక్యంగానే ఉంది. ఇది రాజ్యాంగం వల్లనే సాధ్యమైంది’ అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్రసింగ్ ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు.