న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. 1975 నాటి ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎన్నటికీ మరవలేమన్నారు. 1975 నుంచి 1977 వరకు వ్యవస్థీకృత పద్ధతిలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్య స్పూర్తిని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. తన ట్విట్టర్లో ఖాతాలో ప్రధాని మోదీ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య మూలాలను కాంగ్రెస్ ధ్వంసం చేసిందని, దానికి సంబంధించిన సాక్ష్యాలను ప్రధాని తన ట్వీట్లో పొందుపరిచారు. ఇన్స్టాగ్రామ్ లింకు ద్వారా కాంగ్రెస్ చేసిన అకృత్యాలను ఆయన గుర్తు చేశారు. ఎమర్జెన్సీని ఎందరో హేమాహేమీలను వ్యతిరేకించారని, భారత ప్రజాస్వామ్యాన్ని వారు పరిరక్షించినట్లు ఆయన చెప్పారు. డార్క్ డేస్ ఆఫ్ ఎమర్జెన్సీ హ్యాష్‌ట్యాగ్‌తో మోదీ ఇన్‌స్టాలో కొన్ని అంశాలను వెల్లడించారు.
This is how Congress trampled over our democratic ethos. We remember all those greats who resisted the Emergency and protected Indian democracy. #DarkDaysOfEmergency https://t.co/PxQwYG5w1w
— Narendra Modi (@narendramodi) June 25, 2021
46 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రధాని ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని అమలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిర అవకతవకలకు పాల్పడినట్లు అలహాబాద్ హైకోర్టు తన తీర్పులో తెలిపింది. దీంతో ఆమెను ఆరేళ్ల పాటు పార్లమెంట్ నుంచి బహిష్కరించారు. ఆ సమయంలో ప్రధాని ఇందిరా దేశవ్యాప్త ఎమర్జెన్సీ ప్రకటించారు. రాజ్యాంగ హక్కుల్ని కాలరాశారు. పౌర స్వేచ్ఛను హరించారు. మీడియాను తీవ్రంగా అణిచివేశారు. ఆ సమయంలో అనేక మంది నేతల్ని జైలు పాలు చేశారు.