Commercial vehicles : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోకి నగరం బయట రిజిస్టర్ అయిన కమర్షియల్ వాహనాల (Commercial vehicles) ప్రవేశంపై నిషేధం విధించారు. నవంబర్ 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. ‘ది కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (The Commission for Air Quality Management)’ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే బీఎస్-6 నార్మ్స్ (BS-XI norms) కు లోబడి ఉన్న వాహనాలను మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయించారు.
బీఎస్-6 నార్మ్స్కు లోబడి వాహనాలు కాలుష్య కారకాలను తక్కువగా విడుదల చేస్తాయని, కాలుష్య నియంత్రణలో ఇవి తోడ్పడుతాయని అధికారులు చెప్పారు. ఈ మేరకు ఒక బహిరంగ ప్రకటనను విడుదల చేశారు. అయితే ప్రమాణాలకు లోబడి బీఎస్-6 వాహనాలకు 2026 అక్టోబర్ 31 వరకు మాత్రమే ఢిల్లీలోకి అనుమతి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
బీఎస్-6 కమర్షియల్ వాహనాలతోపాటు సీఎన్జీ, ఎల్ఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా తాజా నిషేధధం నుంచి మినహాయింపు ఇచ్చారు. కాగా ఈ నెల 17న జరిగిన ది కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సమావేశంలో.. నగరంలో కాలుష్యానికి కారణమవుతున్న కమర్షియల్ వాహనాలపై నిషేధం విధించాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
ఆ మేరకు నిషేధాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు అధికారులు తెలిపారు. నగరంలో కాలుష్య తీవ్రత రోజురోజుకు తీవ్రమవుతుండటంతో నవంబర్ 1 నుంచి బీఎస్-6, సీఎన్జీ, ఎల్ఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు మిగతా కమర్షియల్ వాహనాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.