న్యూఢిల్లీ: నాగాలాండ్ ఫైరింగ్ ( Nagaland firing ) ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.11 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనుందని నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియూ రియో వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతాబలగాలు ఆదివారం నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో సెర్చింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడిన కొంతమంది యువకులను చూసి ఉగ్రవాదులుగా పొరబడిన సైనికులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది పౌరులు మరణించారు. అదేవిధంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.