న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: అవినీతి కేసుల దర్యాప్తులో రిటైర్డ్ ఉద్యోగులకు భాగస్వామ్యం కల్పించవద్దని గతంలో జారీ చేసిన నిషేధ ఆదేశాలను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఉపసంహరించుకున్నది. ఏ సంస్థలో అయినా విజిలెన్స్ విధుల్లో రెగ్యులర్ ఉద్యోగులను నియమించాలని, రిటైర్డ్ ఉద్యోగులను తీసుకోకూడదని 2000 సంవత్సరం ఆగస్టులో ఆదేశాలు జారీచేసింది. కొన్ని శాఖలు అవినీతి కేసుల్లో దర్యాప్తు అధికారులుగా రిటైర్డ్ అధికారులను నియమించినట్టు సీవీసీ దృష్టికి వచ్చింది. అవినీతి కేసుల దర్యాప్తులో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను తీసుకోకూడదని సీవీసీ జనవరి 13న ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు సూచించింది. తాజాగా రెండు దశాబ్దాల క్రితం జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకొంటూ కొత్త ఉత్తర్వులు జారీచేసింది.