న్యూఢిల్లీ, అక్టోబర్ 17: కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు జనాభా లెక్కల సేకరణకు (Census) శ్రీకారం చుట్టనున్నది. జనగణన-2027 మొదటి దశకు సంబంధించిన ముందస్తు పరీక్షను వచ్చే నెల 10 నుంచి 30 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల నుంచి గృహాల జాబితాను, జనాభా లెక్కలను సేకరించనుంది.
ఈ మేరకు కేంద్ర హోం శాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీచేసింది. జనగణన-2027కు సంబంధించిన ముందస్తు పరీక్షను నవంబర్ 10 నుంచి 30వ తేదీ వరకు చేపట్టనున్నట్టు రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృత్యుంజయకుమార్ ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇది కాకుండా పౌరులు నవంబర్ ఒకటి నుంచి 7వ తేదీ మధ్య స్వయంగా తమ వివరాలను సమర్పించవచ్చు.