Weather | న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా నెలకొన్న విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరాదిలో ఠారెత్తించే వడగాడ్పులు అనేక మందిని బలి తీసుకున్నాయి. మరోవైపు ఈశాన్య భారతం, కేరళలో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల లక్షలాది మంది ప్రభావితులయ్యారు. కేలండర్ నుంచి వసంత రుతువు అదృశ్యమవుతుందనే సంకేతాలు కూడా వస్తున్నాయి.
వాతావరణంలో అనూహ్య మార్పులపై ఐఐటీ-గాంధీ నగర్ ప్రొఫెసర్ విమల్ మిశ్రా మాట్లాడుతూ, ఈ ఏడాది వేసవి కాలం గడచిన 120 ఏండ్లలో అత్యంత దారుణమైనదన్నారు. ఉత్తరాది వంటి విశాల ప్రాంతంలో 45-47 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు నమోదవడం మునుపెన్నడూ జరగలేదన్నారు. ఆఫ్రికాలోని సహారా ఎడారిలో నమోదయ్యే ఉష్ణోగ్రతల మాదిరిగా ఇక్కడ నమోదవడం అనూహ్యమని తెలిపారు. కనీసం మూడు, నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలను కూడా ఊహించలేదన్నారు.
ఐఐటీ-బాంబే ఎర్త్ సిస్టమ్ సైంటిస్ట్ రఘు మాట్లాడుతూ, ఈ వాతావరణ పరిస్థితులకు ఎల్నినోతోపాటు 2022 జనవరిలో హుంగా టోంగా అగ్ని పర్వతం నుంచి నీటి ఆవిరి వెలువడటం వంటి కారణాలు ఉన్నట్లు తెలిపారు. మధ్య ప్రాచ్య దేశాలు వేగంగా వేడెక్కుతున్నాయని, భూతాపం వల్ల వేడిని ఎడారి లాక్కుంటుందని తెలిపారు. అరేబియా సముద్రంపై వీచే గాలులు వేసవి, వర్షా కాలాల్లో ఉత్తర దిశగా కదలడానికి ఈ వేడి కారణమవుతున్నదన్నారు. ఈ గాలులు అరేబియా సముద్రం వేగంగా వెడెక్కేలా చేస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా ఢిల్లీకి మరింత తేమ గాలి వస్తున్నదని, ఉష్ణోగ్రత పెరుగుతున్నదని చెప్పారు. నగరీకరణ పెరగడం కూడా ప్రధాన కారణమని అంటున్నారు.
ఇలాంటి మితిమీరిన వేడి ప్రజారోగ్యం, విద్యుత్తు, నీరు, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దవాఖానల్లో చేరాల్సిన పరిస్థితులు, నెలలు నిండక ముందే ప్రసవాలు, గర్భస్రావాలు కావడం వంటి వాటికి తీవ్రమైన వడగాడ్పులకు మధ్య సంబంధం ఉందని అధ్యయనాల్లో వెల్లడైనట్లు చెప్పారు. వాతావరణ మార్పుల వల్ల జీడీపీ క్షీణించడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటివి జరుగుతున్నట్లు తెలిసిందన్నారు.