లక్నో: జ్ఞానవాపి మసీదులో పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపట్టిన కార్బన్ డేటింగ్ సర్వేపై అలహాబాద్ హైకోర్టు గురువారం తీర్పు రిజర్వ్ చేసింది.
ఈ అంశంపై ఆగస్టు 3న తుది ఉత్తర్వులు జారీచేస్తామని, అప్పటివరకూ మసీదు ఆవరణలో ఏఎస్ఐ సర్వే చేపట్టరాదని స్టే విధించింది. వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆనుకొని ఉన్న మసీదులోపల కార్బన్ డేటింగ్ సర్వే చేపట్టాలంటూ వారణాసి జిల్లా కోర్టు జూలై 24న తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ మసీదు నిర్వహణ కమిటీ ‘అంజుమన్ ఇంతెజామియా’ తరఫు న్యాయవాదులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. సర్వే చేపట్టాలంటూ హిందువుల తరఫున చూపుతున్న ఆధారాలకు ప్రామాణికత లేదని పిటిషన్లో పేర్కొన్నది.