LPG Price | న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశంలోని అల్పాదాయ వర్గాల్లో ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు వంట కోసం కట్టెల పొయ్యినే ఉపయోగిస్తున్నాయి. వీటికి స్వస్తి పలికి ఎల్పీజీ వినియోగం వైపు మళ్లడంలో పలు అంశాలు అవరోధాలుగా నిలుస్తున్నాయి. గ్యాస్ ధరలు మండిపోతుండటం, చాలా ప్రాంతాల్లో డోర్ డెలివరీ సదుపాయం లేకపోవడం లాంటివి ఈ అడ్డంకుల్లో ప్రధానమైనవని ఓ అధ్యయనం తేల్చింది. ఎల్పీజీ వినియోగంలో ఎదురవుతున్న సవాళ్లను గుర్తించడంతోపాటు ఇంధనాల వినియోగానికి సంబంధించి ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందుకు క్లీన్ ఎయిర్ అండ్ బెటర్ హెల్త్ (సీఏబీహెచ్) ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.