Aaditya Thackeray : కేంద్ర ఎన్నికల సంఘం (Election commission of India) పై ఉద్ధవ్ థాకరే (Uddav Thackeray) శివసేన పార్టీ (Shiv Sena) నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాకరే (Aaditya Thackeray) తీవ్ర విమర్శలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ (EVMs tampering) సాధ్యం కాదంటూ భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ (Rajiv Kumar) చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఈవీఎంల ట్యాంపరింగ్ కచ్చితంగా జరుగుతున్నదని థాకరే ఆరోపించారు. ట్యాంపరింగ్ జరగడంలేదని సీఈసీ ఏ ఆధారంతో చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని.. ఈవీఎంలను, బ్యాలెట్ పేపర్లను పక్కపక్కన పెట్టి వాటిని ట్యాంపరింగ్ చేయవచ్చో లేదో గమనించాలని ఆదిత్య థాకరే సూచించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు చూస్తే.. అది కాంప్రమైజ్డ్ కమిషన్ ఆఫ్ ఇండియాలా కనిపించిందని వ్యాఖ్యానించారు.
ఇవాళ ఉదయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఈవీఎంల గురించి మాట్లాడారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్నదన్న ప్రతిపక్షాల విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యంకాదని, ఈవీఎంల ట్యాంపరింగ్ చేయవచ్చనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. ఈవీఎంలను అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పారు.