Thalapathy Vijay | విల్లిపురం, అక్టోబర్ 27: రాజకీయ నేతగా తొలిసారి బహిరంగ సభలో ప్రసంగించిన తమిళ నటుడు, టీవీకే నేత విజయ్ పరోక్షంగా అధికార డీఎంకేను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తమిజగ వెట్రి కజగమ్ పార్టీని ప్రారంభించిన తర్వాత 8 నెలలకు తొలిసారిగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వివిధ అంశాలతో దేశాన్ని విభజించే శక్తులు, అవినీతికి పాల్పడే వారు తమ పార్టీకి శత్రువులని అన్నారు. ద్రవిడాన్ని, తమిళ జాతీయతను తమ పార్టీ వేరుగా చూడదన్నారు. ఈవీఆర్ పెరియార్, కే కామరాజ్ లాంటి నేతల ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలతో ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు.
డీఎంకే, దాని కుటుంబంపై ఆయన విమర్శలు చేస్తూ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని వారు ద్రవిడ మోడల్ ప్రభుత్వంగా పిలుస్తున్నారని అన్నారు. ఎన్టీ రామారావు, ఎంజీ రామచంద్రన్‌లు సినీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారని, వారు రాజకీయ రంగంలో ప్రవేశించిన అనంతరం కూడా తమ సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులను దోచుకున్నారని అన్నారు. పుట్టుకతో అందరూ సమానమే అన్నది తమ పార్టీ సిద్ధాంతమని స్పష్టం చేశారు. తాను పేరు పెట్టకుండా విమర్శలు చేస్తున్నానంటే అది భయంతో కాదని, ఒక గౌరవ ప్రదమైన రాజకీయాలను చేసే లక్ష్యంతో తాను ఇక్కడకు వచ్చానని నటుడు విజయ్ స్పష్టం చేశారు.