న్యూఢిల్లీ: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రిగా హెచ్డీ కుమారస్వామి బాధ్యతలు చేపట్టారు. తానేమీ స్వార్థపరుడిని కాదు అని, కేవలం స్వంత రాష్ట్రం కోసం కాకుండా, యావత్ దేశం కోసం పనిచేయనున్నట్లు చెప్పారు. మంగళవారం మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన్ను ఓ రిపోర్టర్ ప్రశ్న వేశారు. కర్నాటకలో టెస్లా(Tesla) లాంటి కంపెనీలు ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయా అని అడిగారు. దానికి మంత్రి కుమారస్వామి స్పందించారు. అవును, ఆ ఆలోచన ఉందని, ఆ కంపెనీతో చర్చిస్తామని మంత్రి కుమారస్వామి అన్నారు. కర్నాటక వరకు తాను ఆలోచించడం లేదని, తన ఫోకస్ దేశం మొత్తం ఉందని, దాని ప్రకారమే పనిచేస్తామని, నేనేమీ స్వార్థపరుడిని కాదు అని, దేశ వృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తామని మంత్రి వెల్లడించారు.
టెస్లా కంపెనీ ఇండియాలో తన ప్లాంట్‌ను స్టార్ట్ చేస్తుందా లేదా అన్న డౌట్స్ చాన్నాళ్ల నుంచి ఉన్నాయి. గత ఏడాది ప్రధాని మోదీ.. అమెరికాలో టెస్లా కంపెనీకి వెళ్లి అక్కడ మస్క్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఇండియాలో త్వరలోనే టెస్లాను ప్రారంభిస్తామన్న నమ్మకాన్ని కూడా మస్క్ అన్నారు. మార్చి నెలలో భారత సర్కారు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రకటించింది. దానికి ప్రకారం పన్నులను తగ్గించనున్నారు. టెస్లా లాంటి కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు.