BSF IG : అంతర్జాతీయ సరిహద్దును దాటుకొని దేశంలోకి చొరబడేందుకు పాకిస్థాన్ (Pakistan) ప్రేరేపిత ఉగ్రవాదులు (Terrorists) చేస్తున్న ప్రయత్నాలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. అయినా ఉగ్రవాదులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా నియంత్రణ రేఖ వెంబడి లాంచ్ ప్యాడ్స్ దగ్గర ఉగ్రమూకలు కాపు కాస్తున్నాయని బీఎస్ఎఫ్ ఐజీ (BSF IG) అశోక్ యాదవ్ (Ashok Yadav) తెలిపారు.
కశ్మీర్ లోయలోకి చొరబడేందుకు ఉగ్రమూకలు నియంత్రణ రేఖ వెంబడి కాపు కాస్తున్నాయని నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు ఆయన వెల్లడించారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, చొరబాటుయత్నాలను భగ్నం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శీతాకాలం ప్రారంభానికి ముందు ఉగ్రముఠాలు కశ్మీర్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటాయని అన్నారు.
బాందిపొరా, కుప్వారా సెక్టార్లలోని ఎల్ఓసీ మీదుగా ఉన్న లాంచ్ ప్యాడ్లలో ఉగ్రవాదుల ఉనికి ఉన్నట్లు గుర్తించామని అశోక్ యాదవ్ తెలిపారు. ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడడానికి తగిన సమయం కోసం వేచి చూస్తున్నారని, అయితే వారి చొరబాటు యత్నాన్ని భగ్నం చేయడానికి జమ్ముకశ్మీర్లో బీఎస్ఎఫ్, సైన్యం అలర్ట్గా ఉన్నాయని చెప్పారు.